Search This Blog

Friday, January 6, 2017

నాగార్జునాచార్యుడు తక్షశిలా నగర వీధుల్లో..

నాగార్జునాచార్యుడు తక్షశిలా నగర వీధుల్లో నడిచి వెళుతున్నాడు.

ఒక భిక్షగాడు అతడ్ని సమీపించి అయ్యా, ధర్మం! అని యాచించాడు.

నాగార్జునుడు ఆ బిచ్చగాడి వైపు పరిశీలనగా చూసి నువ్వు నిరుపేదవా నాయనా?! అని ప్రశ్నించాడు.

ఆ బిచ్చగాడు నాకున్న ఆస్తులు ఈ భిక్షపాత్ర, ఈ గోనె అన్నాడు.

వెంటనే నాగార్జునుడు ఆ రెండింటినీ అందుకుని అక్కడే వాటిని వేలం వేశాడు. నిజానికి ఆ రెండు సామానులూ దమ్మిడీ విలువైనా చేయవు. కానీ వేలం వేసేది నాగార్జునాచార్యుడు. కాబట్టి ఆ రెండూ ఎనిమిది మొహరీలు పలికాయి. ఆ ఎనిమిది మొహరీలనూ బిచ్చగాడి దోసిలిలో పోశాడు నాగార్జునుడు.

నాయనా! నీ సామాన్లు అమ్మేశానని విచారపడకు, అవి నీ సోమరితనాన్ని, మందబుద్ధిని తెలియజేస్తున్నాయి. అవి నీ దగ్గర ఉన్నంతకాలం నీకు జ్ఞానోదయం కాదు. ఈ డబ్బుతో ఒక గొడ్డలి కొనుక్కో.. దానితో అడవిలో కట్టెలు కొట్టు, ఆ కట్టెలు విక్రయించుకుని ఆకలి బాధను, సోమరితనాన్ని పోగొట్టుకో. అలవాటు పడేంతవరకు ఈ పని నీకు కష్టంగా, భారంగా ఉంటుంది. కష్టపడితే నీకు మంచి ఫలితం దక్కుతుంది. రెండు వారాల తర్వాత మళ్లీ కనిపించు అని ఆ బిచ్చగాడి భుజం తట్టి వెళ్లిపోయాడు నాగార్జునుడు.

ఆ బిచ్చగాడు గొడ్డలి కొని కట్టెలు కొట్టుకొని జీవించడం ప్రారంభించాడు. పదిహేను రోజులు గడిచాయి. బిచ్చగాడు మారిపోయాడు. ఇప్పుడు అతడిలో ధైర్యం, సోమరితనం లేవు. ఉత్సాహంగా, బలంగా ఉన్నాడు ఆ బిచ్చగాడు.

నాగార్జునాచార్యుడిని కలుసుకున్నాడు. కమ్మని సువాసనలు వెదజల్లే పువ్వులు సమర్పించి, చిరునవ్వుతో నాగార్జునుడికి నమస్కరించాడు.

అప్పుడు ఆచార్యుడు నాయనా గుర్తించావా? కాయాకష్టం చేసుకుని జీవిస్తే ఎంత సుఖం ఉంటుందో!

రత్నగర్భ అని పేరుమోసిన ఈ భారతావని బిచ్చగాళ్లకు ఆలవాలం కారాదు. నీలా కాయకష్టంతో ప్రతి ఒక్కరూ జీవించాలి అని బోధించాడు.
👌👍

No comments:

Post a Comment